భూమి పోతుందనే బెంగ గుండెపోటుతో రైతు మృతి

నర్సాపూర్, వెలుగు : కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో పొలం పోతుందనే బెంగతో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన రామ్ రెడ్డి(58)కి సర్వేనెంబర్ 183 /అ3/1 లో రెండెకరాల పొలం ఉంది. ఇది కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో పోతుందని బెంగ పెట్టుకున్నాడు. వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు, ఆందోళనల్లో పాల్గొంటున్నాడు.

గురువారం రాత్రి భూమి ఉంటుందో..పోతుందోనని కుటుంబసభ్యులతో బాధపడుతూ మాట్లాడాడు. కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో వెంటనే బాలానగర్​లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మళ్లీ స్ట్రోక్​రావడంతో చనిపోయాడు. దీంతో మృతి చెందిన  రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కాల్వ నిర్వాసిత రైతులు చిన్నచింతకుంట గేటు వద్ద నేషనల్ హైవే రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం బైఠాయించారు.

దీంతో ఎస్ఐ శ్రీనివాస్ వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డితో మాట్లాడించారు. రైతుకు ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు రామకృష్ణ, నార్ల అంజా గౌడ్, నారాయణ, శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, పెంటయ్య, రమేశ్ పాల్గొన్నారు.